ప్రత్యేక హోదా విషయంగా భాజపాలతో బాబు వైరం పెట్టుకోవటం గురించి, "బాబు జగన్ వేసిన ట్రాప్‌లో పడిపోయాడు" అనే దిక్కుమాలిన పరిశీలనలు చేస్తున్నారు. ఈ మాట సాక్షాత్తు పార్లమెంటులో మోడీ అన్నాడు. ఆ మాటలు పట్టుకునే ఇంకా కొందరు వేలాడుతున్నారు. కొద్దిగా ఈ విషయం మీద కూడా దృష్టి పెడదాం.1
బాబు బేసిక్‌గా వ్యవహారకర్త. వ్యవహారకర్తలు ఎప్పుడైనా నలుగురినీ కలుపుకుపోవటానికే చూస్తారు కానీ, ఎవరితోను నిష్కారణ వైరం పెంచుకోరు. అటువంటి వ్యవహారశైలి కారణంగానే, రాజకీయ నాయకుడుగా మోడీ పుట్టకముందే, భిన్నధృవాలైన భాజపాలను, కమ్యూనిస్టులను కూడా ఒక వేదిక మీదకు తీసుకురాగలిగాడు.2
ప్రత్యేక హోదా విషయంలో జగన్ ట్రాపులో పడటానికి బాబేమీ రాజకీయాల్లో పసివాడు కాడు. వ్యవహార కర్త కాబట్టే, రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రతిపక్ష నేతగా జగన్ చేత ఆమోదింపచేసుకున్నాడు. ఇప్పుడు జగన్ యు టర్న్ తీసుకుంటే చేసేదేమీలేదు.3
బాబు మీద మోడీకి అత్యంత ద్వేషం. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అప్పటి ఎన్.డి.ఏ. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించటం బాబుతోనే మొదలయ్యింది. దానివల్ల భాజపాలో మోడీ పలుకుబడి తగ్గిపోవటమే కాకుండా, దేశవ్యాప్తంగా భాజపాలు దెబ్బతిన్నారు. అది మోడీ మరవలేదు. అవకాశం కోసం వేచి చూసాడు. 4
గుజరాత్ అల్లర్ల మకిలి అంటుకున్న మోడీకి ప్రధానిగా ప్రజల ఆమోదం కావాలంటే, లౌకికవాద నాయకులతో పొత్తు కూడా అవసరం అనే నిజం తెలిసివచ్చింది. బాబులాంటి దూరదృష్టి ఉన్న నాయకుడితో పొత్తువల్ల తనకు విలువ పెరుగుతుందన్న విషయం అర్థమయ్యి, తెలుగుదేశంతో పొత్తుకు అర్రులు చాచాడు. 5
ఎన్నికలయ్యాయి. ఫలితాలు తెలిసాయి. పొత్తులోని పార్టీల అవసరం లేకపోయినా లోక్‌సభలో సరిపడా మెజారిటీ వచ్చింది. అయినా వాపో బలుపో అర్ధంకాని పరిస్థితి. ఒకానొక సమయంలో ఈ పొత్తుల వల్ల మొహమాటానికి పోయి కడుపు చేయించుకున్న భావన కూడా మోడీకి కలిగినట్లు అనిపిస్తుంది. 6
ఆ కారణంగా పొత్తులోని పార్టీలతో వ్యవహరించే తీరు మారిపోయింది. చిన్న చితక పార్టీలను నయానో భయానో, అదిలించో బెదిరించో చెప్పుచేతల్లో ఉంచుకొవచ్చు. కానీ, 22 ఎంపీలతో ఉన్న తెలుగుదేశాన్ని, బాబును ఎలా గుప్పిట్లో పెట్టుకొవటం? 7
అధికారం కోసం తానా తందనాలాడటానికి రాంవిలాస్‌పాశ్వాన్ కాడు. అవినీతిలో కూరుకుపోయిన లాలూ యాదవ్ కాదు. అవసరానికో ఐటం డాన్సు వేసే నితీష్ కుమార్, కానేకాదు. అబ్దుల్లాలలాగా, దేశద్రోహిగా ముద్రవేయటం కూడా సాధ్యపడదు. ఆయనకున్న బలహీనతలేంటి? ఏవిధంగా చెప్పుచేతల్లో ఉంచుకోవాలి.8
బాబుకున్న బలహీనత ఒక్కటే, అభివృద్ధి. తన రాజకీయ జీవితం చరమాంకానికి వచ్చిందని తెలుసు. చరిత్రలో నిలిచిపోయే విధంగా కొత్తగా ఏర్పడ్డ పాత రాష్ట్రానికి ఏమైనా చేయాలి అనే బలమైన ఆకాంక్ష. అమరావతిని ప్రపంచ పటంలో ప్రముఖంగా నిలపాలనే కోరిక.9
ఇప్పుడు గమనిస్తే, ఎన్నికల సమయం నుంచే బాబును వంచించే ప్రయత్నాలకు భాజపాలు తెరలేపారని స్పష్టమౌతుంది. అందులో భాగమే, తిరుపతి సభలో ప్రత్యేకహోదా ప్రకటన, మరో సభలో తన కుర్చీలో బాబును లాగిన వైనం. ఇవన్నీ బాబును నమ్మించే ప్రయత్నాలే.10
లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని దరిచేర్చాలంటే, ఆర్థిక మంత్రిత్వ శాఖ సహకారం అవసరం. ఆ శాఖ బాబును ఎన్నిరకాలుగా వేధించాలో అన్నిరకాలుగా వేధించింది. డబ్బులడిగితే, డీపీఆర్‌లు ఇవ్వలేదంది, యు.సీ.లు ఇవ్వలేదంది. రక్షణరంగం డబ్బులు మీకు ఇవ్వాలా అని ఎద్దేవా కూడా చేసాడు అరుణ్‌జైట్లీ.11
2014లో ప్రత్యేకహోదా 2016 నాటికి ప్రత్యేకప్యాకేజీ, 2018 నాటికి ప్రత్యేకసాయం, 2019 నాటికి ప్రత్యేకంగా చూస్తాం అనే వరకు వచ్చింది. సంకీర్ణంలో ఉన్న తెలుగుదేశాన్ని మోసం చేయటంతోపాటు, ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ను లోబరుచుకుని రాష్ట్రంలో ఉద్యమాలు చేయించింది. 12
అవినీతి ఆధారంగా, ఒకవైపు జగన్‌ని, మరోవైపు పవన్‌కళ్యాణ్‌ని వాడుకుంది. ఏదో ఒక వంకతో రాష్ట్రంలో అశాంతి రాజేయాలని చూసింది. ఉద్యమాలు అణచివేయటం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యత నిర్వహించినందుకు బాబును ప్రత్యేకహోదాకు వ్యతిరేకిగా ముద్ర వేయించింది. 13
ప్రత్యేక హోదాపై బాబు రాజీ పడి ప్రత్యేకప్యాకేజీ ఓకే అన్నాడని చెప్పే భాజపాలు బాబు-మోడీల చర్చల సారాంశాన్ని విడుదల చేయొచ్చుగా? బాబును ఎలా నమ్మించారో, ఎలా ఒప్పించారో అనే విషయాల్లో గోప్యత ఎందుకు?14
మరోవైపు టీటీడీలో అన్యమతస్థులు పనిచేస్తున్నారని హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసింది. తిరుపతి ఆలయ పూజారి ద్వారా పింకు డైమండు గురించి ఆరోపణలు చేయించింది. జగన్ ప్రభుత్వం వచ్చాక, ఈ ఆరోపణలన్నీ ఏమైనాయో మనందరికీ తెలుసు.15
రాష్ట్రంలో ఉద్యమాలు ఒకవైపు, అవినీతి ఆరోపణలు మరోవైపు, డబ్బులు ఇవ్వని కేంద్రం, మతరాజకీయాలు రాజేస్తూ ఇంకోవైపు, చర్చిద్దామన్నా, అప్పాయింట్‌మెంట్ ఇవ్వని ప్రధాని. ఇన్నిరకాలుగా ఉక్కిరిబిక్కిరి చేసి, పొమ్మనకుండా పొగబెట్టి, బాబుని జగన్ ట్రాప్ చేసాడంటారా!16
2014 ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకోవటం నుంచి, పొత్తు నుంచి బయటకు రావటం వరకూ వ్యక్తిగతంగా బాబు, రాజకీయంగా తెలుగుదేశం బావుకున్నదేమీ లేదు. ఆటుపోట్లు, అవమానాలు, ఛీత్కారాలు, చీదరింపులు తప్పలేదు. చేయని తప్పులన్నిటికీ తెలుగుదేశం మూల్యం చెల్లించింది.17