అత్తిలిలో ప్రసిద్ది చెందిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం.

పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడుగా చెప్పుకునే కుమారస్వామి, భూలోకంలోని అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి తన భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు.
సాధారణంగా శక్తి ఆయుధాన్ని ధరించిన నెమలి వాహనంతో స్వామి దర్శనమిస్తుంటాడు. కొన్ని ప్రాంతాల్లో ఇలా దర్శనమిచ్చే స్వామి, కొన్ని ప్రదేశాల్లో సర్పాకారంలోనూ..లింగాకారంలోనూ..పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగుబంగారంగా కొలువై ఉంటారు.
అందుకు పూర్తి భిన్నంగా స్వామివారి స్వయంభువుమూర్తి కనిపించే క్షేత్రం ఒకటుంది. అదే 'అత్తిలి' సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం. సుబ్రహ్మణ్యస్వామి మహిమలను గురించి కథలు కథలుగా చెప్పుకునే ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో విరాజిల్లుతోంది.
భక్తుల కొంగు బంగారం.. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా ప్రసిద్ధి చెందిన అత్తిలి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి మూర్తి బయటపడిన తీరును ఇక్కడ వారు ఆసక్తికరంగా చెబుతుంటారు.
మరో విశేషం ఏమిటంటే రోజూ గర్భాలయంలోకి సోమసూత్రం గుండా సర్పం స్వామి మూల విరాట్‌ వద్దకు వస్తుందని, అది మరుసటి రోజు ఉదయం బయటకు వెళ్తుందని ఆలయ అర్చకులు చెబుతుంటారు.
ప్రతీనెలా ఈ సర్పం గర్భగుడిలో గానీ, చెరువు గట్టుపై గానీ కుబుసం విడిచి వెళ్తుందని, దానిని స్వామి పాదాల వద్ద ఉంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారాని అంటుంటారు. ఈ ఇంతటి విశిష్టత ఉన్న ఆలయం యొక్క విశేషాలేంటో ఒకసారి తెలుసుకుందాం..
ఆలయ ప్రత్యేకత
చాలాకాలం క్రిందట ఇక్కడి చెరువు సమీపంలో ఒక పెద్ద పాముపుట్ట ఉండేదట. దివ్యమైన తేజస్సు గల ఒక సర్పం ఆ పుట్టలోకి వెళ్లడం .. రావడం చాలామంది చూసేవాళ్లు. అయితే దానిని చూడగానే పవిత్రమైన భావన కలగడం వలన, ఎవరూ కూడా దానికి హాని తలపెట్టలేదు.
ఏకశిలపై శ్రీ వల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్య స్వామి వారి సుందర మనోహర విగ్రహం

కాలక్రమలో చెరువులో నీరు పెరగడం వలన ఆ పుట్ట కరిగిపోయింది.. ఆ పాము విషయాన్ని కూడా అంతా మరిచిపోయారు.
కొంతకాలం తరువాత చెరువుకి సంబంధించిన మరమ్మత్తులు చేపట్టగా, గతంలో పుట్ట వున్న ప్రదేశంలో నుంచి ఏకశిలపై శ్రీ వల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్య స్వామి వారి సుందర మనోహర విగ్రహం బయట పడింది అని చెబుతారు. ఈ విగ్రహం సుమారు రెండు అడుగుల ఎత్తుతో స్పష్ట ఆకృతితో తేజరిల్లుతుంటాడు .
శిలారూపంలో గల స్వామివారి విగ్రహం కనిపిస్తూ వుంటుంది.

అది స్వామివారి మహిమగా భావించిన గ్రామస్తులు, ఆలయాన్ని నిర్మించి ఆరాధించడం ఆరంభించారు. స్వామివారి దేహం సర్పంవలె పొలుసులతో కూడి వుండటం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతగా చెబుతుంటారు.
అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వల్లీ,దేవసేన సమేతంగా చాలా చిన్న విగ్రహ రూపంలో దర్శనం ఇస్తారు. ఆలయ ఆవరణలో రామ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి, గణపతి విగ్రహాలు దర్శనం ఇస్తాయి. స్వామి వారికి రోజు చేసే పూజా కార్యక్రమాలతో పాటు షష్టిరోజు చేసే వివిధరకాల సేవలు ఎంతోగాను ఆకట్టుకుంటాయి
సాధారణంగా అత్తిలి లో పెద్ద పండగ ఏది అని అడిగితే అందరు చెప్పే ఏకైక సమాధానం సుబ్రహ్మణ్య స్వామి షష్టి. 75 సంవత్సరాలుగా ఇక్కడ షష్ఠి తిరునాళ్ళను చేస్తున్నారు. స్వామివారి కల్యాణం సహా 15 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దఎత్తున సాగుతుంటాయి.
జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలోనూ స్థిరపడిన స్థానిక వాసులంతా షష్ఠికి అత్తిలి విచ్చేస్తారు. 15 రోజులపాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో సెట్టింగులు, విద్యుద్దీపాలంకరణ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి.
ఉత్సవాల సందర్భంగా యాత్రికులకు వినోదం, ఉత్సాహం కలిగించేందుకు పెద్ద ఎత్తున రంగులరాట్నాలు, డిస్కోడాన్సు, కొలంబస్‌, ట్రైన్‌ వంటివి ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరం15 రోజుల పాటు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
అత్తిలి సుబ్రహ్మణ్యస్వామి అభిషేక ప్రియుడు. ప్రతీ మంగళవారం, నెల షష్ఠి రోజున భక్తులు పంచామృతాభిషేకాలు, ప్రత్యే పూజలు చేస్తూ తమ మొక్కులు తీర్చుకుంటారు. నాగ, కుజ దోషాలు ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించి అభిషేకాలు చేస్తారు.
సంతానం లేని వారు నాగుల చీర, ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకుంటారు. సంతానం కలిగాక తలనీలాలు, పటికిబెల్లం తూకం వేసి మొక్కులు తీర్చుకుంటారు. అత్తిలిలో ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా స్వామి దర్శనం చేసుకోవడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ.
పౌరాణికంగా అత్తిలి గ్రామం అత్రి మహర్షి తపోభూమి అని ప్రసిద్ధి పొందింది. అత్రి మహర్షి పేరు మీదుగానే అత్తిలి పేరు ఏర్పడింది అని ప్రసిద్ధి. మొదట్లో అత్రి అన్న పదమే తరవాత కాలంలో అత్తిలిగా రూపాంతరం చెందింది.
అత్రి మహర్షి ఆరాధించిన శివలింగమే ఉమా సిద్దేశ్వరస్వామి వారి ఆలయంలోని మూలావిరాట్టు అని ఐతిహ్యం. స్వామివారిపై చేసిన అభిషేక జలాలు తన శరీరంపై నుంచే వెళ్ళాలనే కోర్కెను వ్యక్తపరచినట్టు ఆ వరం అనుగ్రహించినట్టు చెప్తారు.
మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని స్థానికులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు , సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. రైల్వే స్టేషన్ ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
Saraswathi N సేకరణ
You can follow @SaradhiTweets.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.