భారత దేశం - ఆరోగ్య వ్యవస్థ ఒక ఆలోచన.
1. ముందుగా మనదేశం మొత్తం బడ్జెట్ లో ఆరోగ్యం కోసం రెండు శాతం కంటే తక్కువ కేటాయిస్తారు. దీనివలన ప్రజలే వాళ్ళ ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు పెట్టుకోవాలి.
2. నాయకత్వ లేమి - మన దేశంలో వైద్యం ఎలా చెయ్యాలి? అన్న దాని గురించి వైద్యుల కన్నా మిగిలిన వాళ్లే
ఎక్కువ మాట్లాడతారు. ఐ ఎ యస్ తరహాలో ఇండియన్ మెడికల్ సర్వీసు ని ప్రారంభించామని అరవై ఏళ్ల క్రితం మొత్తుకున్నా ఇంతవరకు కార్య రూపం దాల్చలేదు. ఎంబీబీఎస్ సిలబస్ లో కూడా నాయకత్వ లక్షణాలు నేర్పే పాఠం ఒక్కటీ ఉండదు. దానివలన వైద్యులు ప్రాథమిక అరోగ్య కేంద్రం నుంచి, వైద్య విద్యా సంచాలకులు
వరకు ఎక్కడా నాయకత్వ లక్షణాలు చూపలేక వారి అభిప్రాయాన్ని గట్టిగా చెప్పలేక పోతున్నారు.
3. తీవ్రమైన ఆర్థిక, భౌగోళిక, సంకృతిక, భాషా పరమైన భేదాలు ఒక ఐక్య ప్రణాళికను అమలు పరిచేందుకు తీవ్ర అడ్డంకి గా మారాయి.
4. భారత ప్రభుత్వం ఎప్పుడూ కూడా అంతర్జాతీయ సంస్థలు నిర్దేశించిన ప్రమాణాలను బట్టి
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను రూపొందించటం తప్పితే మన దేశానికి అవసరమైన రీతిలో అవి రూపు దిద్దుకోవు. సులభంగా చెప్పాలంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు.
5. వైద్యానికి సంబంధించి న చట్టాలు కూడా పూర్తిగా ఒక ఆలోచన లేకుండా మక్కీ కి మక్కీ ఇతర దేశాల నుండి దిగుమతి చేసి పార్లమెంటు లో
ఆమోదింప జేస్తున్నారు. దీనివలన వాటి అమలు కష్ట సాధ్యం అవుతోంది. ఉదాహరణకు మన మానసిక అరోగ్య చట్టం తరచి చూస్తే బ్రిటిష్, ఆస్ట్రేలియా చట్టాన్ని 90 శాతం పోలి ఉంటుంది.
6. ప్రభుత్వానికి జవాబుదారీ తనం లోపించటం, ప్రజలు ప్రశ్నించక పోవటం. ఇది అనాదిగా వస్తోంది, దీని గురించి చెప్పనవసరం లేదు.
7.వైద్య సేవల అసమతౌల్యం. అన్ని రకాల వైద్య సేవలు దాదాపుగా పెద్ద పట్టణాలు, నగరాల్లో మాత్రమే కేంద్రీకృతం అయి ఉండటం. దాని వలన సకాలంలో గ్రామీణ ప్రజానీకానికి వైద్యం అందక పోవటం.
8. రిఫరల్ వ్యవస్థ లోపం. ప్రాథమిక, ఏరియా, కేంద్ర ఆసుపత్రులు ఉన్నప్పటికీ వాటి మధ్య సమన్వయం లేకపోవటం.
9. వైద్యం విషయం లో పరిశోధనలు దాదాపుగా శూన్యం అని చెప్పాలి. అందుకు తగిన వనరులు కూడా ప్రభుత్వం సమకూర్చడం లేదు. దేశంలో కేవలం స్వయం ప్రతిపత్తి కలిగిన ఐదారు సంస్థల్లో మాత్రమే పరిశోధనలు జరుగుతున్నాయి.
10. విధివిధానాల లేమి. ఇంతవరకు కూడా ఏదైనా ఒక రోగానికి వైద్యం చేయటం కోసం విదేశీయులు
రాసిన విధివిధానాలు పాటించటం తప్పితే మన దేశ సంస్థలు వీటిని రూపొందించటం తక్కువ అనే చెప్పాలి. అందువలన మన దేశ ప్రజానీకానికి అనుగుణమైన వైద్యం అందటం లేదు.
11. వైద్య విద్యలో ప్రామాణికత లోపించటం. ప్రభుత్వ, ప్రైవేటు,జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల్లో చదివిన స్నాతకోత్తర వైద్యుల లో నైపుణ్య
భేదాలు ఉండటం. విదేశీ సంస్థలు మన దేశంలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల్లో చదివిన వైద్యులకు ప్రవేశాలు కల్పించటానికి మొగ్గు చూపుతాయి.
12. ఆరోగ్య పరమైన గణన చేయకపోవటం. మన దేశంలో ఏ రోగంతో ఎంత మంది బాధపడుతున్నారు అన్న దానిపై అంచనాలు తప్పితే నిర్దేశక గణన జరిపి ఖచ్చితమైన లెక్కలు లేవు.
అందువలన ఏ రోగానికి ఎంత కేటాయించాలి అన్న అంచనా కి రాలేకపోతున్నారు.
13. ఆరోగ్యం పట్ల అవగాహన లేమి. ప్రజల్లో విపరీతమైన అపోహ, మూఢనమ్మకాలు మొదలైనవి. అలాగే ప్రభుత్వమే ప్రోత్సహించే కొన్ని అశాస్త్రీయ వైద్య పద్ధతులు. పదోతరగతి వరకు ఆరోగ్యం గురించి పెద్దగా పాఠ్యాంశాలు లేకపోవటం.
14. సరైన వ్యాయామం, ఆహార పద్ధతులు, శుభ్రత పాటించక పోవటం. మద్యపానం, ధూమపానం ఎక్కువగా చెయ్యటం. మానసిక ఒత్తిడికి గురి కావటం. ఇవన్నీ కూడా కారణాలు. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
సమూల మార్పులు రావటానికి దశాబ్దాలు దాటి శతాబ్దాలు రావాలి. మార్పు వస్తుందని ఆశిద్దాం. ఇప్పటికి ఆ ఆశ ఒక్కటే.
You can follow @miryalasrikanth.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.